– జనరల్ కు రిజర్వ్ కావడంతో కలిసి వచ్చే అంశం
– జనసేనకు కేటాయించే అవకాశం
– అదే జరిగితే రాధాకృష్ణ పార్టీ మారడం ఖాయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం అవుతోంది. మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్ లకు రిజర్వేషన్లు ప్రకటించారు. విజయవాడకు సంబంధించి జనరల్ కు రిజర్వ్ చేశారు. దీంతో వంగవీటి రాధాకృష్ణ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది విజయవాడ కార్పొరేషన్. మేయర్ పదవి అంటే క్యాబినెట్ హోదాతో కూడుకున్నది. నగరం మొత్తం పట్టు ఉంటుంది. మేయర్ పీఠంపై వంగవీటి రాధాకృష్ణ కూర్చోబెట్టి.. వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టు బిగించాలని కూటమి భావిస్తోంది. అయితే రాధాకృష్ణ టిడిపి నుంచి కాకుండా జనసేన నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
ఆశావహులు అధికం..
విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా చాలామంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. దాదాపు పదిమంది వరకు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను కలిసి తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడుకు మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పలుమార్లు చంద్రబాబుతో పాటు లోకేష్ ను కలిశారు. ఆయన విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడిచింది. దేవినేని కుటుంబ సభ్యులు సైతం చాలామంది లోకేష్ ను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.
ఇంతవరకు దక్కని పదవి..
వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మేయర్ పదవి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2004లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అటు తర్వాత ప్రజారాజ్యం.. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. కానీ ఎక్కడ విజయం దక్కలేదు. 2019 ఎన్నికల కు ముందు వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కానీ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రాధాకృష్ణ. ఇప్పుడు మేయర్ పదవికి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బలమైన అభ్యర్థి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ సీటును జనసేన ఆశిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఆ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరం. అందుకే వంగవీటి రాధాకృష్ణ టిడిపి నుంచి జనసేనలో చేరి మేయర్ అభ్యర్థిగా మారుతారన్న టాక్ ఉంది. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి నుంచి జనసేనలో చేరిన చాలామంది చివరి నిమిషంలో టికెట్లు లభించాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలంటే టిడిపి నుంచి జనసేనలోకి కొంతమంది నేతలను రప్పించాలని చూస్తున్నారు. విజయవాడకు సంబంధించి వంగవీటి రాధాకృష్ణ సైతం సైకిల్ దిగి జనసేన గూటికి చేరుతారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..
