క్రైమ్ మిర్రర్ : భార్యను తనతో కాపురానికి పంపకపోతే ఆమె మైనర్ కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానంటూ అత్తను బెదిరించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పుంగనూరు పరిసర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గతంలో అతడికి వివాహం కాగా.. కుటుంబ విభేదాల కారణంగా మొదటి భార్యతో విడిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా గతంలో భర్తతో విడిపోయి తన కుమార్తెతో కలిసి నిందితుడితో నివసించేది.
ఈ క్రమంలో నిందితుడి ప్రవర్తనపై కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. మైనర్ బాలిక విషయంలో గతంలోనూ నిందితుడిపై ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు సమాచారం. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన అతడు భార్యను తిరిగి తన వద్దకు రావాలని కోరాడు. ఆమె అందుకు నిరాకరించడంతో అత్తపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
భార్యను పంపాలంటూ అత్తపై ఒత్తిడి
భార్య తన వద్దకు రాకపోవడానికి ఆమె తల్లే కారణమని భావించిన నిందితుడు.. ఆమెతో గొడవకు దిగి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై మరో కేసు నమోదైంది. అయినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భార్యను తిరిగి తన వద్దకు పంపించాలంటూ ఆమె తల్లిని మరోసారి బెదిరించినట్లు తెలిపారు.
మైనర్ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరింపు
కుటుంబ సభ్యులు మైనర్ బాలికను తమ వద్దే ఉంచుకోవడంతో నిందితుడు మరింత ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. తన భార్యను తిరిగి తీసుకురాకపోతే బాలికకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఆమె అమ్మమ్మను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని ఫొటోలను బంధువులకు పంపినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : వివాహేతర సంబంధం తెంచుకుందని కక్ష.. మహిళ దారుణ హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం
