రంగారెడ్డి చేవెళ్ల మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గొల్లపల్లి సమీపంలో బైక్ను ఓ వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్, ఆయన భార్య సావిత్రి, కుమారుడు ధనుష్, కుమార్తె అక్షయ కలిసి చన్వెళ్లిలో జరిగిన ఓ విందుకు వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని కుటుంబ సభ్యులు బైక్పై తిరిగి ఇంటికి వస్తుండగా గొల్లపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో మధుసూదన్, సావిత్రి, ధనుష్ అక్కడికక్కడే మృతి చెందారు. అక్షయ మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో మేడిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. అండర్వేర్లో రూ.2.25 కోట్ల గోల్డ్ బిస్కెట్లు!
