శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు గడ్డి మందు తాగించి, అనంతరం తాను కూడా పురుగుల మందు సేవించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి, ఆమె ఏడు నెలల కుమారుడు మృతి చెందగా.. మూడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చిలకపాలెం గ్రామానికి చెందిన తొణంగా మీన (29) కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం మీన తన ఏడు నెలల కుమారుడు కులదీప్, మూడేళ్ల కుమార్తె గాయత్రికి గడ్డి మందు తాగించింది. అనంతరం తాను కూడా అదే మందును సేవించినట్లు తెలుస్తోంది.
విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ముగ్గురినీ హుటాహుటిన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మీన, ఆమె కుమారుడు కులదీప్ మృతి చెందారు. చిన్నారి గాయత్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల పూర్తి కారణాలు, కుటుంబ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో చిలకపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
