కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఆయన పర్యటనకు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్ ప్రమాదవశాత్తు పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖలోని ఐఎన్ఎస్ డేగా ప్రాంతంలో మంగళవారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ అప్పలకొండ రక్షణ మంత్రి ప్రయాణించాల్సిన విమానం వద్ద భద్రతా విధుల్లో ఉన్నారు. విధుల్లో ఉన్న సమయంలో ఆయన వద్ద ఉన్న సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్) అనుకోకుండా పేలినట్లు తెలుస్తోంది.
రైఫిల్ నుంచి వెలువడిన బుల్లెట్ అప్పలకొండ ఛాతీ ఎడమ వైపు భాగంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. పేలుడు శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ప్రమాదం ఎలా జరిగింది? రైఫిల్ అనుకోకుండా ఎందుకు పేలింది? అనే అంశాలపై విచారణకు ఆదేశించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సింగ్ విశాఖకు వచ్చారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను ప్రారంభించడంతో పాటు, ఫ్లీట్ సపోర్ట్ షిప్-5 నిర్మాణానికి కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఆధునికీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్‌ను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి, విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో పాటు పలువురు నేవీ, రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఒడిశాలోని కోరాపుట్‌కు బయలుదేరి వెళ్లారు.
also read: హోంగార్డు ఉద్యోగం కోసం చెప్పులు లేకుండా 1600 మీటర్లు.. 6 నిమిషాల్లోనే పూర్తి చేసిన వితంతువు!
