Homeసినిమా89 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదు.. ప్రముఖ యూట్యూబర్‌పై చోరీ, బెదిరింపుల కేసు

89 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదు.. ప్రముఖ యూట్యూబర్‌పై చోరీ, బెదిరింపుల కేసు

తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమితపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించకుండా పోవడానికి ఆమె కారణమని, ఆ విషయంపై ప్రశ్నించినప్పుడు తనను బెదిరించారని ఆరోపిస్తూ 89 ఏళ్ల వృద్ధుడు పోలీసులను ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఫిర్యాదు రావడంతో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తుకు నాగర్‌కోవిల్‌కు చెందిన మధుమితతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఓ సందర్భంలో మధుమిత ఆయన వాహనంలో ప్రయాణించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను బస్‌స్టాప్ వద్ద దింపిన అనంతరం పేచ్చిముత్తు తన ఇంటికి వెళ్లారు.

ఇంటికి చేరుకున్న తర్వాత మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై మధుమితను ఫోన్‌లో సంప్రదించి గొలుసు గురించి అడిగినట్లు తెలిపారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు తీస్తానంటూ ఆమె బెదిరించినట్లు పేచ్చిముత్తు ఆరోపించారు.

ఇటీవల ఈ వ్యవహారంపై ఆయన రాజాక్కమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం తిరునెల్వేలి పోలీసుల పరిధిలోకి వస్తుండటంతో కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.

బంగారం, నగదుతో రీల్స్.. ఇటీవలే యూట్యూబర్ ఇంట్లో చోరీ

మధుమిత సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బంగారం, నగదుతో కూడిన వీడియోలు, రీల్స్ చేస్తూ గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె ఇంట్లో భారీగా బంగారం చోరీకి గురైన ఘటన కూడా వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో మొత్తం 118 సవర్ల బంగారం చోరీ అయినట్లు సమాచారం.

ఈ చోరీ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 98 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు మధుమితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

ఈ పరిణామాల మధ్య రెండేళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న బంగారు గొలుసు వ్యవహారంపై తాజాగా ఫిర్యాదు రావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు కేసులోని ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది.

also read: రామాయణం షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు