-
రూ.400 కోట్లతో సుందరీకరణ పనులు
-
వచ్చే నెలలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు
-
సాగర నగరానికి మరిన్ని సొబగులు
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు సన్నాహాలు మొదలయ్యాయి. సాగరనగరం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ అత్యంత వైభవంగా జరగనుంది.
అంతర్జాతీయ, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, దేశ విదేశీ ప్రతినిధులు తరలిరానున్నందున నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ కార్యచరణను ప్రారంభించింది.
విశాఖ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద.. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేసింది. ప్రపంచ స్థాయి వేదికపై విశాఖ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఇనుమడింప చేసేందుకు ఈ నిధులతో కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
-
ప్రధాన రహదారుల అభివృద్ధి..
విశాఖ నగరంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో సెంట్రల్ డివైడర్ల ఆధునీకరణతో పాటు పచ్చదనాన్ని భారీగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ట్రాఫిక్ సాఫీగా సాగేలా ప్రముఖ కూడళ్లను రీ డిజైన్ చేసి సుందరీకరించడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. అత్యాధునిక ఎల్ఈడి విద్యుత్ దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. నగర ముఖచిత్రాన్ని మార్చేలా డివైడర్ల మరమ్మత్తులు, పెయింటింగ్స్, పచ్చదనం పెంపు వంటి పనులను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో చేపట్టనున్నారు.
-
జీవీఎంసీ రంగంలోకి..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నగరంలో పనుల పురోగతిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సిరిపురంలోని దత్ ఐలాండ్ జంక్షన్ నుంచి పోలమాంబ ఆలయం వరకు జరుగుతున్న సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులను తాజాగా కమిషనర్ పరిశీలించారు.
ఇంజనీరింగ్ అధికారులతో పాటు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులతో కూడా సమీక్ష జరిపారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తక్షణమే పనులు పట్టాలెక్కించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని.. నిర్దేశిత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
-
నెల రోజులే గడువు..
నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో ఈ సమ్మిట్ జరగనుంది. కేవలం నెలరోజుల గడువు మాత్రమే ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రధాన పనులన్నింటినీ నెల రోజుల్లోగా నూరు శాతం పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు.
ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోక విశాఖ సుందర నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ కోసం వచ్చే అతిధులకు విశాఖ సరికొత్త అనుభూతిని అందించేలా నగరపాలక సంస్థ యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది.
