-
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
న్యాయపరమైన ఉత్కంఠకు తెర
-
ఆరువారాల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్. రాష్ట్ర హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా నెలకున్న న్యాయపరమైన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో పంచాయితీ, మున్సిపల్ సహా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు పచ్చ జెండా ఊపింది.
స్థానిక సమరానికి అడ్డంకిగా మారిన పలు పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన ధర్మాసనం.. రాబోయే ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మార్గం సుగమం అయింది.
-
బీసీ రిజర్వేషన్ల కొట్టివేత..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి కూడా కీలక తీర్పును వెల్లడించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఏ పరిస్థితుల్లోనైనా మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్న సుప్రీంకోర్టు గత తీర్పును ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన 50 శాతం సీలింగు లోబడి మాత్రమే రిజర్వేషన్లను పునర్విభజించి.. ఎన్నికల బరిలో దిగాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం అన్ని రాజకీయ పార్టీలకు ఏర్పడింది.
-
వైసీపీకి షాక్..
ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం కోర్టులో షాక్ తగిలినట్లు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలన్న ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యేదాకా స్థానిక ఎన్నికలను నిలిపివేయాలంటూ వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కోర్టు నిర్ధ్వందంగా కొట్టివేసింది.
ఎన్నికల నిర్వహణ వాయిదా వేయడానికి ఎలాంటి బలమైన కారణాలు లేవని తేల్చి చెప్పింది. వీటితో పాటే వార్డుల పునర్విభజన, పంచాయితీల విలీనాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేయడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో రాబోయే ఆరు వారాల గడువులోగా.. నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఏ క్షణం అయినా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
