-
అక్రమంగా వేలాదిమంది భారత యువత రిక్రూట్మెంట్
-
తెలంగాణలో వెలుగు చూసిన ఓ ముగ్గురి వ్యవహారం
-
ఉక్రెయిన్ తో సాగుతున్న యుద్ధభూమిలో బలిపీఠం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రష్యా సైన్యంలో వేలాది మంది భారతీయ యువత ఉన్నారా? చాలా వ్యూహాత్మకంగా రష్యా భారత యువతను ఆకర్షించిందా? యుద్ధ పీఠంపై భారత యువతను రష్యా నిలబెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
ఉక్రెయిన్ తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా మానవ వనరుల సామర్థ్యాన్ని దెబ్బతీసింది. యుద్ధ క్షేత్రంలో వేలాదిమంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం, భారీగా క్షతగాత్రులు కావడం వల్ల క్రెమ్లిన్ కు సైనిక కొరత ఏర్పడింది. దేశీయంగా నిరసనలు వెలువెత్తకుండా ఉండేందుకు రష్యా ప్రభుత్వం ఇతర దేశాల యువతపై కన్నేసింది.
ఆర్మీ హెల్పర్స్, సెక్యూరిటీ గార్డ్స్, సపోర్టు స్టాఫ్ పేర్లతో దక్షిణాసియా దేశాలైన భారత్, నేపాల్, శ్రీలంక ల నుంచి యువకులను రిక్రూట్ చేసుకునే నెట్వర్క్ ను పుతిన్ యంత్రాంగం వేగవంతం చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ముగ్గురు, నలుగురు యువకుల వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
దేశవ్యాప్తంగా వందలాది, వేలాదిమంది భారతీయ యువకులు.. ఇప్పటికే రష్యా సైన్యంలో కాంట్రాక్టు సైనికులుగా చేరి ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.
-
అత్యంత వ్యూహాత్మకంగా..
అత్యంత వ్యూహాత్మకంగా భారతీయ యువతను తన సైన్యంలో చేర్చింది రష్యా. ఈ రిక్రూట్మెంట్ వెనుక అత్యంత పకడ్బందీగా పనిచేస్తున్న బ్రోకర్ల దందా, నిరుద్యోగ సమస్య ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మోసపూరిత ఏజెంట్లు భారతదేశంలోని నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు నెలకు లక్షల్లో జీతాలు, ఏడాదికి 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ప్యాకేజీలు, రష్యన్ పౌరసత్వం లభిస్తుందని నమ్మబలుకుతున్నారు.
కేవలం క్యాంపుల్లో పర్యవేక్షణ, సైనిక సహాయకులుగా మాత్రమే పనిచేయాలని మొదట్లో చెబుతున్నారు. తరువాత యుద్ధ కాంట్రాక్టులు చిక్కుకుంటున్నారు. అసలు ఈ కాంట్రాక్టుల తీవ్రత ఏంటి? ఆధునిక యుద్ధక్షేత్రంలో డ్రోన్లు, క్షిపణుల వర్షం మధ్య ఎంతటి ప్రాణాపాయం ఉంటుందనేది వారు గ్రహించలేకపోతున్నారు. విదేశీ గడ్డపై డాలర్ల సంపాదన, కుటుంబ పేదరికం పోతుందన్న ఆశతో భారతీయ యువకులు ఈ మృతి మార్గంలోకి వెళ్తున్నారు.
-
అక్కడకు వెళ్లిన తరువాత..
వివిధ మార్గాల్లో భారతీయ యువతను ఆకర్షిస్తుండగా.. వారు రష్యాలోకి అడుగుపెట్టిన తరువాత కథ పూర్తిగా మారిపోతోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పై సంతకం చేయించుకోగానే.. ఆ యువకులకు రోస్టోవ్ లేదా ఇతర శిక్షణ శిబిరాల్లో కేవలం 15 నుంచి 20 రోజులపాటు ప్రాథమిక ఆయుధ శిక్షణ ఇస్తున్నారు.
భాష రాకపోవడం, కఠినమైన మైనస్ డిగ్రీల చలి వాతావరణం, సరైన రక్షణ కవచాలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో.. వారిని నేరుగా ఫ్రంట్ లైన్ బఫర్, బాంబుల దాడి జరిగే మొదటి వరుస సైనిక దళాల తరహాలో నిలబెడుతున్నారు.
మధునాతన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, క్లస్టర్ బాంబుల దాడుల నుంచి తప్పించుకునే కనీస యుద్ద నైపుణ్యాలు లేని అమాయక విదేశీ యువకులు క్షణాల వ్యాధులు మృత్యువాత పడుతున్నారు.
-
భారత ప్రభుత్వానికి సవాల్..
రష్యా సైనిక రిక్రూట్మెంట్ ఇప్పుడు భారత దౌత్య వర్గాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖకు పెను సవాల్ గా మారింది. భారత ప్రభుత్వం రష్యాపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి.. పలువురిని డిశ్చార్జ్ చేయించి వెనక్కి తీసుకొచ్చింది. అయితే చట్టబద్ధంగా రష్యన్ ఆర్మీతో కాంట్రాక్టు కుదుర్చుకున్న వారిని వెనక్కి రప్పించడం, అంతర్జాతీయ న్యాయపరంగా సంక్లిష్టంగా మారింది.
దీనికి తోడు భారత్ లో ఉన్న అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్లు ఇప్పటికీ దుబాయ్, బ్యాంకాక్ లేదా సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా యువకులను మాస్కోకు చేరవేస్తూనే ఉన్నాయి.
అయితే అటువంటి ట్రావెల్ ఏజెన్సీలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉన్న నిరుద్యోగం, అత్యాశను ఆసరాగా చేసుకుని ఈ చీకటి వ్యాపారం సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేసి.. ఇలాంటి రిక్రూట్మెంట్లు జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
