క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని, వేరే లీడర్లు ఎవరూ వేలు పెట్టొద్దని కేసీఆర్ అనడం వల్లే పార్టీ నష్టపోయిందంటూ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు.
ఎక్స్ (X) వేదికగా కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఘాటుగా స్పందించారు. ‘గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్ద మనిషినే తప్పు పడుతున్నావ్. మీ చేతగానితనాన్ని నేరుగా అధినేతపై మోపుతున్నావ్’ అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. పార్టీ ఇబ్బందులకు కేసీఆర్‌ను బాధ్యులను చేసేలా మాట్లాడటం తగదనే రీతిలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
అంతేకాకుండా, వినాయక నిమజ్జన వేడుకలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. నిమజ్జన సమయంలో డబ్బులు ఇచ్చి మరీ కేసీఆర్ పాటలు పెట్టించారనే నిజం మీ అంతరాత్మకు బాగా తెలుసని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ గాల్లో మాట్లాడనని, ప్రతి అంశంపై పక్కా ఆధారాలతోనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై ‘నాతో పెట్టుకోకు’ అంటూ కేటీఆర్‌ను కవిత హెచ్చరించారు. ఈ పరిణామాలు గులాబీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటి నిల్వలు.. ఆందోళనలో అధికారులు
