Homeతెలంగాణథియేటర్‌లో 22 నిమిషాలు ప్రకటనలు.. యాజమాన్యానికి రూ.75 వేల జరిమానా

థియేటర్‌లో 22 నిమిషాలు ప్రకటనలు.. యాజమాన్యానికి రూ.75 వేల జరిమానా

హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు సుదీర్ఘంగా వాణిజ్య ప్రకటనలు, ట్రైలర్లు ప్రదర్శించడంపై జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించిన థియేటర్ యాజమాన్యానికి… మొత్తం రూ.75,000 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో బాధిత ప్రేక్షకుడికి పరిహారంగా రూ.25,000, జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50,000 జమ చేయాలని స్పష్టం చేసింది.

అసలు సినిమా ఆలస్యం కావడంతో ఫిర్యాదు

2025 జూన్‌లో ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ‘కుబేర’ సినిమా చూసేందుకు హైదరాబాద్‌లోని సదరు థియేటర్‌కు వెళ్లారు. రాత్రి 10:35 గంటలకు సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా.. వారు 10:30 గంటలకే థియేటర్‌లోని తమ సీట్లలో కూర్చున్నారు. అయితే నిర్ణీత సమయానికి సినిమా ప్రారంభం కాలేదు.

సుమారు 22 నిమిషాల పాటు థియేటర్‌లో వాణిజ్య ప్రకటనలు, ఇతర సినిమాల ట్రైలర్లు ప్రదర్శించారు. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ ప్రకటనలు కూడా ప్రసారం చేసి.. అసలు సినిమాను మరింత ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో ప్రేక్షకుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

కమిషన్‌ను ఆశ్రయించిన ప్రేక్షకుడు

సినిమా ప్రారంభంలో జరిగిన జాప్యంతో పాటు ప్రకటనల కారణంగా తాను ఎదుర్కొన్న అసౌకర్యంపై సదరు వ్యక్తి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్.. థియేటర్ యాజమాన్యం వ్యవహరించిన తీరును పరిశీలించింది.

ప్రేక్షకుడికి కలిగిన మానసిక ఆవేదన, అసౌకర్యానికి పరిహారంగా రూ.25,000 చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే ఇలాంటి అనుచిత వ్యాపార పద్ధతులు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50,000 జమ చేయాలని పేర్కొంది.

అదనపు ఆదాయం కోసమే ఆలస్యం చేశారని వ్యాఖ్య

వాణిజ్య ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం పొందాలనే ఉద్దేశంతోనే సినిమా ప్రదర్శనను ఆలస్యం చేసినట్లు కమిషన్ అభిప్రాయపడింది. ఈ జాప్యం కారణంగా ఫిర్యాదుదారుడు తన ఇంటికి చేరుకోవాల్సిన సమయం కంటే సుమారు గంట ఆలస్యంగా, వేకువజామున 3 గంటలకు ఇంటికి చేరుకున్నట్లు విచారణలో ప్రస్తావించింది.

థియేటర్‌లో ప్రకటనలు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కు అని యాజమాన్యం చేసిన వాదనను కూడా కమిషన్ అంగీకరించలేదు. ప్రేక్షకులు టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసేందుకు వచ్చిన నేపథ్యంలో.. వారికి అనవసరమైన ఆలస్యం, అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని తీర్పులో స్పష్టం చేసింది.

ఈ తీర్పుతో సినిమా ప్రదర్శనకు ముందు ప్రకటనల పేరుతో ప్రేక్షకులను ఎక్కువసేపు వేచి ఉండేలా చేసే థియేటర్లపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ దృష్టి మరోసారి పడింది.

also read: గంగా ఆసుపత్రి వైద్యుల సేవలకు హీరో రామ్ చరణ్‌ ప్రత్యేక ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు