స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వైద్య ప్రక్రియ కోసం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. తనకు అందించిన సేవలు, వైద్యుల అంకితభావాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన చికిత్సలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ఎస్. రాజా సభాపతి, డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌లకు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఆసుపత్రిలో తనకు ఎంతో ఆప్యాయతతో, శ్రద్ధతో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు.
వైద్యులు మాత్రమే కాకుండా నర్సులు, ఇతర సిబ్బంది కూడా తన పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారని చరణ్ తెలిపారు. ఆసుపత్రిలో తనకు లభించిన సంరక్షణ పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ.. తనకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు.
అదే సమయంలో గంగా ఆసుపత్రికి లభించిన మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపుపై కూడా రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. వైద్య పరిశోధన రంగంలో అందించే ‘నాస్ అవుట్‌స్టాండింగ్ రీసెర్చ్ పేపర్ అవార్డు’ను గంగా ఆసుపత్రి ఐదోసారి దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఆసుపత్రి చేస్తున్న పరిశోధనలు, సాధిస్తున్న విజయాలకు ఈ అవార్డు నిదర్శనమని కొనియాడారు.
ఇక రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయానికి సంబంధించి కొన్ని వారాల క్రితం కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా అదే చికిత్సకు సంబంధించిన తదుపరి వైద్య ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
also read: అత్యాచార బాధిత బాలికకు జడ్జి లేఖ.. పరిహారంతో పాటు అందించాలని హైకోర్టు ఆదేశం
