రంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: ఒక వైపు సాంకేతిక విప్లవంతో గ్రహాలపై నివాసాల కోసం వెతుకుతుంటే, మరో పక్క ఏఐ, డిజిటల్ ప్రపంచంలో దూసుకపోతున్న సందర్భం, కాని ఇంకా మూఢనమ్మకాల పేరుతో పేదలు, వృద్దుల జీవితాలను బలితీసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు పదికిలోమీటర్ల దూ రంలో, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మంచాల మండలం నోముల గ్రామంలో మానవత్వాన్ని దహించివేసే దారుణ ఘోరం చోటుచేసుకుంది. మంత్రాలనెపంతో పల్నాటి వెంకటమ్మ అనే వృద్ధురాలిని ఊరి నడిబొడ్డున ఉన్న వేపచెట్టుకు కట్టేసి గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన వెంకటమ్మ చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతుంది. కాగా ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
14మందిపై కేసు నమోదు…
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వృద్ధురాలిపై దాడికి అసలు కారణాలు ఏమిటి? క్షుద్రపూజలు చేస్తున్నారనే ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దాడికి పాల్పడిన వారిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.క్షుద్రపూజలు, చేతబడి వంటి మూఢనమ్మకాల పేరుతో ఎవరిపైనా దాడి చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో నొముల గ్రామంలో కొంతకాలం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
