తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై తన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో అలరించిన ఆయన.. ఇక డిజిటల్ వేదికపైనా తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి చిరంజీవి ఓ ప్రత్యేక పాడ్‌కాస్ట్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం.
చిరంజీవి సినీ ప్రయాణాన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన తొలుత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, డాక్యుమెంటరీ కంటే పాడ్‌కాస్ట్ ద్వారా తన జీవితంలోని అనుభవాలు, ఆలోచనలను మరింత సహజంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాడ్‌కాస్ట్ ఆలోచనకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఆలోచనను చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు రచయిత బీవీఎస్ రవి ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు చిరంజీవి సానుకూలంగా స్పందించడంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాక్ షోలు, వినోద కార్యక్రమాల కోసం రచనలు చేసిన అనుభవం ఉన్న బీవీఎస్ రవి ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన కంటెంట్ రూపకల్పన, రచనా బాధ్యతలను చూసుకుంటున్నట్లు సమాచారం. చిరంజీవి సాధారణ ఇంటర్వ్యూల్లో పెద్దగా వెల్లడించని అనేక విషయాలు ఈ సిరీస్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు, కెరీర్లో ఎదురైన సవాళ్లు, విజయాల వెనుక చేసిన కృషి, వ్యక్తిగత అనుభవాలు, సినీ ప్రయాణంలోని కీలక మలుపులు వంటి అంశాలపై చిరంజీవి స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ఈ పాడ్కాస్ట్పై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత పాడ్‌కాస్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఇందులో ఏ అంశాలను చర్చిస్తారు వంటి వివరాలు వెల్లడవుతాయి.
also read: ఇంట్లోనే దంపతుల దారుణ హత్య.. రక్తపు మడుగులో మాజీ సైనికుడు, ఆయన భార్య మృతదేహాలు
