ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహార భద్రతా నిబంధనల అమలుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 25 ఆహార సంస్థలను అధికారులు మూసివేయించారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. మొత్తం 66 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్‌కు అధికారులు అందజేశారు.
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, ఆహార భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ సి. అరుణ్ బాబు పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 40 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 13 మంది అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు పాల్గొన్నారు.
తనిఖీల సందర్భంగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పలు సంస్థలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మూసివేసిన సంస్థల్లో అనకాపల్లిలోని ఒక ధాబా, నెల్లూరు జొన్నవాడ రోడ్డులోని ధాబా, నెల్లూరు ట్రంక్ రోడ్డులోని ఓ హోటల్, విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని టిఫిన్ సెంటర్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ భోజనశాల ఉన్నాయి.
ఇక చిన్నస్థాయి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన మరో 45 ఆహార సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మూసివేసిన సంస్థల యాజమాన్యాలకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేపట్టి, గుర్తించిన లోపాలను పూర్తిగా సరిదిద్దుకున్న తర్వాతే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
also read: సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నల వర్షం.. హామీల అమలుపై తేదీలు చెప్పాలని బహిరంగ లేఖ
