తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఫైనాన్స్ సంస్థను మోసం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనతో పాటు భార్య అన్నాబత్తుని పుష్ప, మరో వ్యక్తి తూనుగుంట్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొంత భాగం విక్రయించిన భూమిని పూర్తిగా తమ ఆధీనంలోని ఆస్తిగా చూపించి రుణం పొందినట్లు ఫైనాన్స్ సంస్థ ఆరోపించింది.
ఈ వ్యవహారం 2019లో శివకుమార్ తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీజే ఇంప్లెక్స్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న ఆయన భార్య పుష్ప.. విజయవాడకు చెందిన ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.3 కోట్ల రుణం తీసుకున్నట్లు సమాచారం. ఈ రుణానికి శివకుమార్ గ్యారంటర్‌గా ఉన్నారు. రుణం కోసం తెనాలిలోని 1,200 చదరపు గజాల స్థలాన్ని తనఖాగా చూపించారు.
అయితే రుణానికి సంబంధించిన వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగినట్లు ఫైనాన్స్ సంస్థ తెలిపింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం బకాయి రూ.5 కోట్లకు పైగా చేరినట్లు పేర్కొంది. దీంతో బకాయిల వసూలు కోసం సంస్థ ప్రతినిధులు తనఖా పెట్టిన ఆస్తిని పరిశీలించేందుకు వెళ్లడంతో భూమికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెనాలి మున్సిపల్ రికార్డులను పరిశీలించగా 1,200 చదరపు గజాల స్థలంలో 700 చదరపు గజాలు మాత్రమే శివకుమార్ పేరు మీద ఉన్నట్లు గుర్తించినట్లు ఫైనాన్స్ సంస్థ తెలిపింది. మిగిలిన 500 చదరపు గజాల స్థలాన్ని 2012లోనే ఇతరులకు విక్రయించినట్లు రికార్డుల ద్వారా తెలిసిందని పేర్కొంది.
ఇప్పటికే విక్రయించిన భూమిని కూడా తమ ఆస్తిగా చూపించి మొత్తం 1,200 చదరపు గజాలను తనఖా పెట్టి రుణం పొందారని ఆరోపిస్తూ ఐకేఎఫ్ ఫైనాన్స్ లీగల్ మేనేజర్ శ్రీనివాసరావు తెనాలి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే హోదాను ఉపయోగించుకుని ఈ వ్యవహారం సాగించారని ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయ స్థాయిలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగిందా అనే అంశంపై అనుమానాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫైనాన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అన్నాబత్తుని శివకుమార్, ఆయన భార్య పుష్ప, కంపెనీ మేనేజింగ్ పార్ట్‌నర్ తూనుగుంట్ల శ్రీనివాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెనాలి వన్‌టౌన్ సీఐ సీహెచ్ రాంబాబు వెల్లడించారు. భూమి రికార్డులు, రుణానికి సంబంధించిన పత్రాలు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
also read: రోడ్డుపై రగడ.. యువకుడికి మంత్రి చెంపదెబ్బ? వైరల్ వీడియోతో ఢిల్లీ పాలిటిక్స్ హీట్
