యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌పై నమోదైన ఉపా(UAPA) కేసులో పోలీసుల దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. కేసులో భాగంగా ఆయన ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలు, నిధుల మూలాలు, మావోయిస్టు సంబంధాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ఏడు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం కోర్టు రావణ్‌కు అక్టోబర్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.
సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు సాగిన కస్టడీ విచారణలో రావణ్‌ను పోలీసులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన యూట్యూబ్ ఛానల్‌కు ఎక్కువ వ్యూస్, ఆదరణ రావాలనే ఉద్దేశంతో ఆవేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
అయితే, ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయం, ఆర్థిక లావాదేవీలు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాలపై పోలీసులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన వివరాలు రాలేదని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జులైలో ఏలూరులో నిర్వహించిన ఓ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలు రావణ్‌పై ఉన్నాయి. నిషేధిత సంస్థకు మద్దతుగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇతర కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, ఉపా కేసులో మాత్రం ఆయన రిమాండ్ కొనసాగుతోంది.
దర్యాప్తులో భాగంగా రావణ్ నిర్వహించే ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన ఆదాయ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయన బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఛానల్ నిర్వహణతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న వైసీపీ నేత ఇంద్రసేనా చౌదరి, ఛానల్ సీఈవో గమనను కూడా పోలీసులు గతంలో పలుమార్లు విచారించినట్లు సమాచారం. రావణ్‌తో వారికి ఉన్న సంబంధాలు, పరస్పరం జరిగిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక దర్యాప్తులో భాగంగా రావణ్‌కు చెందిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు సమాచారం. ఆయన బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. నిధులు ఏ మార్గంలో వచ్చాయి? ఆర్థిక వ్యవహారాల్లో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? తెర వెనుక నుంచి ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు సమాచారం.
రావణ్‌పై నమోదైన ఉపా కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఫోరెన్సిక్ నివేదికలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.
also read: వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపు…!
