Homeఅంతర్జాతీయంమేయర్ గా వంగవీటి...! టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్...

మేయర్ గా వంగవీటి…! టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్…

  • పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న రాధాకృష్ణ

  • శరవేగంగా మారుతున్న బెజవాడ రాజకీయాలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయవాడ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ బరిలో దిగుతారా? ఆ మేరకు చంద్రబాబు నుంచి ఆయనకు హామీ లభించిందా? అందుకే ఆయన తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు. ప్రజారాజ్యం పార్టీ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న కీలక నిర్ణయాలు, ఇతరత్రా అంశాలను ప్రస్తావిస్తూ వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా విజయవాడ మేయర్ పదవికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా టాక్ నడుస్తోంది.

ఆశావాహులు అధికం…

అక్టోబర్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ మేయర్ కోసం ఇప్పటినుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన తన తండ్రితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిశారు. బయోడేటా కూడా సమర్పించారు. బోండా ఉమామహేశ్వరరావు సీనియర్ నేత. బలమైన వాయిస్ వినిపిస్తున్నారు పార్టీ తరఫున. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఆయనలో ఉన్న అసంతృప్తిని గుర్తించి అధిష్టానం ఆయన కుమారుడికి మేయర్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడిచింది.

ప్రముఖంగా రాధాకృష్ణ పేరు…

అయితే ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఐదేళ్లపాటు టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వంగవీటి రాధాకృష్ణకు తప్పకుండా పదవి వస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. నామినేటెడ్ పదవి సైతం దక్కుతుందని భావించారు. కానీ ఎప్పటికప్పుడు అంచనాలు మారుతున్నాయి. అయితే ఇప్పుడు విజయవాడ నగర మేయర్ గా వంగవీటి రాధా పేరు వినిపిస్తోంది. నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో రాధాకృష్ణ అయితే బాగుంటుందన్న అభిప్రాయం టిడిపి వర్గాల్లోనూ ఉంది.

జనసేన సైతం…

విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన ఆశిస్తున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో విజయవాడ నుంచి జనసేనకు ప్రాతినిధ్యం లేదు. పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోతిన మహేష్ బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడంతో సుజనా చౌదరి పోటీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు అవకాశం రాకపోవడంతో.. ఇప్పుడు మేయర్ పదవి కోసం పట్టుపట్టే అవకాశం ఉంది. ఆ కారణంతోనే వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు టిడిపి మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించితే.. మద్దతు తెలపాలని అభ్యర్థించినట్లు సమాచారం. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కూటమి ఉమ్మడి మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ రంగంలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు