-
బన్సల్ కు తోడుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ
-
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
-
బలమైన సంస్థాగత వ్యూహంతో కమలదళం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పై ఫుల్ ఫోకస్ పెట్టింది బిజెపి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో తమ వ్యూహాలతో బిజెపికి గెలుపు అందించిన నేతలను ఇన్చార్జిలుగా నియమించింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ధీటుగా బిజెపిని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన వ్యూహకర్త సునీల్ బన్సల్ ను తెలంగాణ ఇన్చార్జిగా కొనసాగిస్తూనే.. ఆయనకు తోడుగా కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్, జాతీయ మహిళా కమిషన్ మాజీ చీఫ్ రేఖ శర్మ లను సహా ఇన్చార్జిలుగా బిజెపి అధిష్టానం నియమించింది. గతంలో ఉత్తరప్రదేశ్లో అమిత్ షా తో కలిసి పనిచేసే చారిత్రాత్మక విజయాలు అందించిన బన్సల్.. అనంతరం ఒడిస్సా, బెంగాల్, తెలంగాణ క్లస్టర్ బాధ్యతలను చూశారు. ఇప్పుడు తెలంగాణ పై పూర్తిస్థాయి దృష్టి సారించేలా కొత్త టీం రంగంలోకి దిగింది. దీంతో బీజేపీ హై కమాండ్ తెలంగాణను సైతం కైవసం చేసుకునేందుకు గట్టిగా రంగంలోకి దిగినట్లు అర్థం అవుతోంది.
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా …
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు తెచ్చుకోలేకపోయింది బిజెపి. కేవలం ఎనిమిది శాసనసభ స్థానాలకు పరిమితం అయింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని గట్టి సంకేతాలు పంపింది. 35 శాతానికి పైగా ఓటు షేర్ సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్కు ఏకైక ప్రత్యామ్నాయం తామేన్ అన్న సంకేతాన్ని ప్రజల్లో బలంగా నాటింది. అయితే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. అలా ఖాళీ అవుతున్న స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు బన్సల్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నెట్వర్క్ నిర్వహణలో బన్సల్ కు మంచి పేరు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ పట్టును పెంచేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
ఆ ఇద్దరిదీ మంచి ట్రాక్ రికార్డు…
మరోవైపు బన్సల్ కు సహాయ నేతలుగా కొత్త బృందంలో అభయ్ పాటిల్, రేఖ శర్మల ఎంపిక కూడా అత్యంత వ్యూహాత్మకంగా జరిగింది. కర్ణాటకలోని బెలగావి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. అట్టడుగు స్థాయి సంస్థ గత నిర్మాణం పై అపారమైన అనుభవం ఉన్న అభయ్ పాటిల్.. కర్ణాటక సరిహద్దు జిల్లాలతో పాటు తెలంగాణ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం వర్గాల్లో పార్టీని పరుగులు పెట్టించేందుకు తోడ్పడనున్నారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సుదీర్ఘకాలం పనిచేశారు రేఖా శర్మ. ఆమె నియామకం ద్వారా క్షేత్రస్థాయిలో మహిళా ఓటు బ్యాంకు ను ఆకర్షించేందుకు అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది.
అంత సులువు కాదు…
వాస్తవానికి బన్సల్ బెంగాల్లో చూపించిన దూకుడు.. తెలంగాణలో అమలు చేసేందుకు అంత సులువు కాదు. అక్కడ కమ్యూనిస్టులు జీరో కావడం వల్లే బీజేపీ పని సులువు అయింది. తెలంగాణలో గులాబీ పార్టీకి ఇంకా బలమైన సంస్థాగత పునాది ఉంది. ఆపై బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే కేవలం భావోద్వేగం, సిద్ధాంతపరమైన అంశాలే కాకుండా.. ప్రజా సమస్యలపై రాజీలేని క్షేత్రస్థాయి పోరాటాలు చేయాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే బీజేపీ నుండి అటువంటి ప్రయత్నాలు జరగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఊపును మున్సిపల్ ఎన్నికల్లో చూపలేకపోయింది బిజెపి. ఇంకా రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. మరి బన్సల్ టీం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
కాంగ్రెస్ లో ‘ఎమ్మెల్సీ’ సందడి…!
-
హయత్‌నగర్‌లో వైభవంగా గణనాథుడి శోభాయాత్ర
-
విద్యుత్ ఎమర్జెన్సీ..! పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం…
-
వైసీపీకి శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ గుడ్ బై…?
