-
రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు సంబంధించి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు
-
బాండ్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్. అగ్రిగోల్డ్ ప్లాట్ లకు సంబంధించి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఊరట కల్పించింది. వీరి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. అగ్రిగోల్డ్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అమరావతి సచివాలయంలో సమావేశం అయింది. తొలి విడతలో భాగంగా మొత్తం 35 వేల 544 మంది బాధితులకు లబ్ధి చేకూరనుంది. మరో 6989 మంది ప్లాట్లు కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించినా.. వారికి రిజిస్ట్రేషన్లు చేయలేదు. వీరికి రెండో విడతలు లైన్ క్లియర్ కానుంది. ఏపీతోపాటు తెలంగాణ, మిగిలిన రాష్ట్రాలలో 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాధితుల నుంచి బాండ్ల వివరాలు సేకరించాలని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించడం విశేషం.
దశాబ్ద కాలంగా…
అగ్రిగోల్డ్ దశాబ్ద కాలంగా నలుగుతున్న సమస్య. దానిని పూర్తిగా పరిష్కారం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2018 పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయల లోపు డిపాజిట్లకు మాత్రమే చెల్లింపులు చేశారు. తర్వాత నాలుగేళ్లపాటు నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బాధితులందరికీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయించింది. తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులనుంచి బాండ్ల వివరాలు సేకరించడానికి ఏపీలో ఏడు, తెలంగాణలో 3.. ఒడిస్సా,, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పది టీములు ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి అగ్రిగోల్డ్ డిపాజిట్లు చేసిన, పెట్టుబడులు పెట్టిన బాధితుల ఒరిజినల్ బాండ్లు చూపించి వాటి జిరాక్స్లు అందజేయాల్సి ఉంటుంది. గతంలో అగ్రిగోల్డ్ భూముల్లో మొక్కలు నాటగా.. ఆ భూముల్లో అటవీ శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి ప్లాంటేషన్ ను ఆడిట్ చేయించనున్నారు. అగ్రిగోల్డ్ మున్సిపల్ ఏరియాలో వేసిన లేఅవుట్లు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మున్సిపల్ అధికారులతో సమీక్ష చేయనున్నారు. అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసి నష్టపోయిన ప్రతి లబ్ధిదారులకు ఉపశమనం కల్పిస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యురాలు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చివరి డిపాజిట్ దారుడు వరకు న్యాయం చేస్తామని చెప్పారు.
చాలా రాష్ట్రాల్లో బాధితులు…
అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కేవలం ఏపీ మాత్రమే కాదు దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఒకవైపు డిపాజిట్లు సేకరిస్తూనే స్థిరాస్తి వ్యాపారంలో అడుగుపెట్టింది. భారీగా భూములు కొనుగోలు చేసింది కూడా. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకుగాను ప్లాట్లను తక్కువ ధరకు అందించేందుకు సులభ వాయిదా పద్ధతుల్లో కూడా డిపాజిట్లు సేకరించింది. ప్రారంభంలో మెరుగైన సేవలు అందించడంతో అగ్రిగోల్డ్ విస్తరణ శరవేగంగా జరిగింది. అయితే ఒక్కసారిగా అగ్రిగోల్డ్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో వేలాదిమంది లబ్ధిదారులు, వేలాదిమంది ఏజెంట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డిపాజిట్లు వెనక్కి రాకపోవడంతో ఏజెంట్ల పై ఒత్తిడి పెరిగింది. దీనిని భరించలేక రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఏజెంట్లు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. కూటమి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సమస్యల అధ్యయనంతో పాటు పరిష్కార మార్గం చూపేందుకు సీఎం చంద్రబాబు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్న ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సూచనలు చేస్తూ వస్తోంది. తాజాగా సమావేశమైన ఈ కమిటీ డిపాజిటర్ల బాండ్లు పరిశీలనకు ప్రత్యేక అధికార బృందాలను నియమించడం విశేషం.
