-
మహిళా బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు
-
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కొనసాగింపు అందుకే
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : మరోసారి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా బిల్లును పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్షణంలో నైనా ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గట్టి కార్యాచరణ జరుగుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ముగించకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ అనుకూల పరిస్థితులు ఉండడంతో కేంద్ర పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మొన్ననే తిరస్కరణ…
గత ఏప్రిల్ లో నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా బిల్లును పార్లమెంటులో పెట్టారు కేంద్ర పెద్దలు. ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టగా తిరస్కరణకు గురైంది. గతంలో ఈ బిల్లు ప్రవేశపెట్టామని.. మరోసారి ఆమోదించే ఛాన్స్ లేదని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు వ్యతిరేకించాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభలో మూడింట రెండో వంతు ఆమోదం అవసరం. కానీ మెజారిటీకి కూత వేటు దూరంలో మహిళా బిల్లు ఆమోదం నోచుకోలేదు. ఈ తరుణంలో తిరస్కరణకు గురి కావడంతో.. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ రెండు బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది. ఇప్పుడు సానుకూల పరిస్థితి ఏర్పడడంతో ఆ రెండు బిల్లుల ఆమోదానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఆ కారణంతోనే…
ప్రస్తుతం వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సమయంలో కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం అధికారికంగా ముగించకపోవడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లు కోసమే సమావేశాలను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అక్టోబర్ 12 నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో సంఖ్యాపరంగాను జాగ్రత్త పడుతోంది కేంద్ర ప్రభుత్వం. తృణముల్ కాంగ్రెస్, శివసేన యు బి టి, ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక ఎంపి ల తో పాటు డీఎంకే నుంచి మద్దతు లభిస్తుందని బిజెపి లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనకు కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర క్యాబినెట్లో డీఎంకే చేరే అవకాశం ఉందని బిజెపి వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిపి ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
పెరగనున్న నియోజకవర్గాలు…
మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన అంశంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభం అయింది. 50% ఫార్ములాను అనుసరిస్తే ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలకు.. మరో 50% పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరో 80 స్థానాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 13 సీట్లు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 117 అసెంబ్లీ సీట్లకు గాను 60 వరకు పెరుగుతాయి. 17 పార్లమెంట్ సీట్లకు గాను మరో ఎనిమిది తోడయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఆశావహులకు ఇదో బంపర్ ఆఫర్.
