టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిమ్ నిర్మాణం పేరుతో ఓ యువకుడి నుంచి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు అడగడంతో బెదిరించి, అతడి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను బలవంతంగా తీసుకున్నట్లు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ యువకుడికి షార్ట్ ఫిలిమ్ నిర్మాణానికి సంబంధించి వర్షిణి వెంకట్ పరిచయమయ్యారు. సినిమా ప్రాజెక్టు పేరుతో అతడి నుంచి సుమారు రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగకపోవడంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని యువకుడు కోరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో డబ్బులు అడిగిన బాధితుడిని బెదిరించడంతో పాటు అతడి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను బలవంతంగా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో బాధితుడు చెన్నైలోని గిండి పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మోసం, బలవంతపు వసూళ్లు, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వర్షిణి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో 8 లగ్జరీ కార్లు దగ్ధం
