-
సౌదీ అరేబియా పై క్షిపణులు, డ్రోన్ల దాడి
-
ఇరాన్ మద్దతుతో హౌతి విద్రోహుల పంజా
-
అప్రమత్తమైన అమెరికా
-
ఆ తొమ్మిది దేశాల్లో ఉన్న తమ పౌరులకు అలెర్ట్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మళ్లీ అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ దాని ప్రాక్సి దళాలు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన పరిస్థితి నెలకొంది. రాబోయే సైనిక ముప్పును ముందస్తుగా ఊహిస్తూ ఇరాన్ తన సాయుధ బలగాలను తీవ్ర హెచ్చరిక హోదా జారీచేసింది. తమ రక్షణ వ్యవస్థను సిద్ధం చేయడంతో పాటు సైన్యానికి కూడా కీలక ఆదేశాలు జారీచేసింది. పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన క్యాంపు డేవిడ్ పర్యటనను వెంటనే రద్దు చేసుకున్నారు. అత్యవసరంగా వైట్ హౌస్ కు చేరుకున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతన్యహు సైతం తన అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
రియాద్ తో పాటు ప్రధాన నగరాలపై…
Also Read: కారు రూపంలో వచ్చిన కాలయముడు.. మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం!
ఇరాన్ మద్దతు గల హౌతి విద్రోహులు సౌదీ అరేబియా రాజధాని రియాద్ తో పాటు పలు ప్రధాన నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ భీకర దాడుల కారణంగా సౌదీ అరేబియా అంతట వైమానిక దాడి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్ లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో భారీ ఎత్తున నల్లటి పొగలు, మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. సౌదీ సైనిక కూటమి ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా ఒక బాలిస్టిక్ క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడులు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం అయ్యింది. పశ్చిమ ఆసియాలో 9 దేశాల్లో ఉన్న తన పౌరుల కోసం స్టెప్ అలర్ట్ ను జారీచేసింది. ఈ ప్రాంతంలో అమెరికన్ ప్రయోజనాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున.. ఎమర్జెన్సీ లేకపోతే ఈ దేశాలకు ప్రయాణాలు చేయవద్దు అని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.
చమురు కేంద్రాలపై…
Also Read: వినాయక చవితి వేడుకలు జరుపుకున్న కొద్ది గంటల్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్..
కేవలం రియాద్ పై మాత్రమే కాదు.. ఎర్ర సముద్రం తీరంలోని ప్రముఖ చమురు ఎగుమతి కేంద్రమైన యాన్బూలోని సౌదీ అరమ్కో చమురు కేంద్రాలను కూడా టార్గెట్ చేసుకున్నారు. యమన్ రాజధాని సనాలో జరిగిన దాడులకు ప్రతి చర్యగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతి వర్గాలు ప్రకటించాయి. ఈ నిరంతర దాడులు కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా, ఎర్ర సముద్ర సముద్రమార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. ఇప్పటికే గ్లోబల్ షిప్పింగ్ రంగం తీవ్ర ఆందోళన చెందుతుండగా… ఈ దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read:ఎన్కౌంటర్లో నిందితుడు మృతి, పాక్ సరిహద్దు నెట్వర్క్పై ఇన్వెస్టిగేషన్!
అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టర్కీ వంటి దేశాలు.. పాకిస్తాన్, సౌదీ అరేబియా తో కూడిన రక్షణ ఒప్పందాల ద్వారా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఈ హౌతి దాడులను తీవ్రంగా ఖండించింది. అమెరికా మాత్రం ప్రస్తుతానికి ప్రత్యక్ష సైనిక జోక్యానికి దూరంగా ఉంది. పరిస్థితిని గమనిస్తోంది. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
