దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక స్పష్టత ఇచ్చింది. మర్చంట్ పేమెంట్లపై కొన్ని రుసుములు అమల్లోకి వచ్చినప్పటికీ.. ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయరాదని పేర్కొంది. దీంతో సాధారణ యూపీఐ వినియోగదారులకు అదనపు భారం ఉండదని స్పష్టం చేసింది.
తాజా నిబంధనల ప్రకారం.. వ్యాపారులకు చేసే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు రుసుము వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీని కస్టమర్ కాకుండా సంబంధిత వ్యాపార సంస్థే భరించాల్సి ఉంటుంది. ఈ రుసుముకు గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించారు.
అయితే పీ2ఎం (పర్సన్ టు మర్చంట్) లావాదేవీల్లో 95 శాతానికి పైగా రూ.2,000 లోపే ఉంటాయని ఎన్పీసీఐ తెలిపింది. అందువల్ల చిన్న మొత్తాల్లో చేసే సాధారణ కొనుగోళ్లపై ఈ మార్పు ప్రభావం ఉండదని పేర్కొంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లతో పోలిస్తే సవరించిన యూపీఐ ఎండీఆర్ రుసుములు తక్కువగానే ఉన్నాయని వెల్లడించింది.
కొన్ని సేవలకు ఫ్లాట్ ఛార్జీ
రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని ప్రత్యేక రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ రుసుము వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని కూడా వినియోగదారులపై మోపకుండా సంబంధిత వ్యాపారులు లేదా సేవా సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది.
పీ2పీ చెల్లింపులు పూర్తిగా ఉచితం
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పీ2పీ (పర్సన్ టు పర్సన్) యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. లావాదేవీ మొత్తం ఎంత ఉన్నా పీ2పీ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.
అంటే.. కొత్త రుసుములు ప్రధానంగా మర్చంట్ పేమెంట్లకు సంబంధించినవే. సాధారణంగా వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ బదిలీలపై ఎలాంటి అదనపు భారం ఉండదు. దీంతో యూపీఐ వినియోగదారులకు ఈ విషయంలో ఊరట లభించినట్లయింది.
also read: కాన్పూర్ ఫార్మా వ్యాపారి హత్య కేసులో ట్విస్ట్.. కుమారుడి ఫోన్ కాల్స్‌పై పోలీసుల ఆరా
