Homeక్రైమ్80s ట్రెండ్‌తో బయటపడిన 45 ఏళ్ల నాటి దొంగతనం

80s ట్రెండ్‌తో బయటపడిన 45 ఏళ్ల నాటి దొంగతనం

క్రైమ్ మిర్రర్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80ల నాటి ఫొటోల ట్రెండ్ ఓ మహిళను 45 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉజ్జయినిలోని ఓ స్వర్ణకారుడి దుకాణంలో బంగారు హారం చోరీకి గురైంది. ఆ సమయంలో ఓ యువతి ఆ నగను దొంగిలించి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం పోలీసులు అప్పట్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆ యువతి అనంతరం తన పేరు, గుర్తింపును మార్చుకున్నట్లు సమాచారం. కొత్త వ్యక్తిగా మరో ప్రాంతంలో స్థిరపడి ఇన్నేళ్లుగా సాధారణ జీవితం గడిపింది.

ఏఐ ఫొటో.. చివరకు పోలీసులకు క్లూ

కాలం గడిచిపోయింది. 45 ఏళ్ల క్రితం జరిగిన చోరీ ఘటన కూడా అందరూ మరిచిపోయారు. అయితే ఇటీవల 80ల కాలం నాటి ఫ్యాషన్, ఫొటోల ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళ కూడా ఏఐ సాయంతో తన పాతకాలపు రూపాన్ని పోలిన ఓ ఫొటోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదే ఫొటో అనుకోకుండా నాటి చోరీకి గురైన స్వర్ణకారుడి దృష్టిలో పడింది. ఫొటోలోని మహిళను గుర్తించిన అతడు వెంటనే పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 45 ఏళ్ల క్రితం జరిగిన బంగారు హారం చోరీకి సంబంధించిన విషయాలను ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పోలీసులకు అంతుచిక్కని కేసు.. ఓ ఏఐ ఫొటో కారణంగా అనూహ్యంగా కొలిక్కి వచ్చింది.
also read : స్వతంత్ర్ భరద్వాజ్‌కు మధ్యంతర బెయిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు