విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.179.9 కోట్లను కేటాయించగా.. రాష్ట్రవ్యాప్తంగా 3,008 మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది.
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేసింది. వివిధ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.
విడుదలైన మొత్తంలో ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 1,063 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.76.1 కోట్లు కేటాయించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా 1,193 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.48.4 కోట్లు అందించనున్నారు.
అదేవిధంగా 573 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.36.9 కోట్లు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద 179 మంది బీసీ విద్యార్థులకు రూ.18.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఇప్పటికే స్కాలర్‌షిప్‌లు మంజూరైన లబ్ధిదారులందరికీ చెల్లింపులు పూర్తయ్యాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. విదేశాల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. స్కాలర్‌షిప్ బకాయిల విడుదలతో విద్యార్థులు తమ ఉన్నత విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొంది.
also read: విశాఖలో ఆర్టీసీ బస్సుకు భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ముప్పు
