ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత.. వివాహం తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా వివాహ వ్యవస్థ, మహిళలపై ఉన్న సామాజిక ఆంక్షల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను, భావోద్వేగాలను కలిపే బంధమని నమిత అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు పెళ్లికి సంబంధించిన నియమాలు, బాధ్యతలు, సంప్రదాయాలు మహిళలకు మాత్రమే ఎందుకు వర్తించాలనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.
పెళ్లి తర్వాత మహిళలు ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ సంప్రదాయాలను పాటించాలి అనే విషయంలో సమాజంలో అనేక రకాల అంచనాలు ఉంటాయని నమిత పేర్కొన్నారు. అయితే పురుషుల విషయంలో ఇలాంటి నిబంధనలు చాలా తక్కువగా కనిపిస్తాయని అన్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వివాహానికి సంబంధించిన ఆచారాలు, ఆలోచనా విధానాలను కూడా సమానత్వ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
ముఖ్యంగా పెళ్లయిందనే గుర్తింపుగా మహిళలు మాత్రమే తాళిబొట్టు ఎందుకు ధరించాలనే ప్రశ్నను నమిత ప్రస్తావించారు. వివాహ బంధానికి భార్యాభర్తలు ఇద్దరూ సమాన భాగస్వాములైనప్పుడు.. పురుషులు కూడా పెళ్లయిందనే గుర్తింపుగా ఏదైనా చిహ్నాన్ని ధరించే విధానం ఎందుకు ఉండకూడదని ఆమె ప్రశ్నించారు.
నమిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి. భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండాలని భావిస్తున్న పలువురు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తున్నారు. మరోవైపు, వివాహ సంప్రదాయాలు, సంస్కృతికి వాటి స్వంత ప్రాధాన్యత ఉందని.. వాటిని ప్రశ్నించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో నమిత చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
also read: ప్రీతి జింటాకు ఇప్పటికీ అదే భయం.. కొత్త పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
