-
కెసి వేణుగోపాల్ తో చర్చలను ఖండించని వైసిపి
-
మారిన జాతీయ రాజకీయ వ్యూహం
-
బిజెపి నుంచి లభించని సాయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయ వ్యూహం మారుతోందా? ఆయన క్రమేపి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా? బిజెపిని నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా? జాతీయస్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంచనాకు వచ్చారా? అందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో చర్చలు జరిపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఢిల్లీ వర్గాల్లో కూడా దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయస్థాయిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి ఎదురైంది. అన్ని ఆలోచించి ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
-
బెంగళూరు వేదికగా..
ప్రస్తుతం బెంగళూరు వేదికగా రాజకీయాలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తనకు అత్యంత సన్నిహితుడైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ బెంగళూరు వేదికగా కాంగ్రెస్ పార్టీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ భేటీ వార్తలను అటు కాంగ్రెస్ పార్టీ కానీ.. ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ స్పష్టంగా ఖండించలేదు.
దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. కేంద్రంలో అధికార పక్షానికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తన జాతీయ రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
-
మారిన అభిప్రాయం..
ఏపీ రాజకీయాల విషయంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ అనుకూల సెఫాలజిస్టులు, విశ్లేషకులు సరికొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు రాకపోయినా.. ఓట్ల చీలిక వైసీపీ విజయవకాశాలను కొంతవరకు దెబ్బతీసింది అనే అంచనా ఉంది.
భవిష్యత్తులో వైసిపి, కాంగ్రెస్ ఒకే గొడుగు కిందకు వచ్చిన లేదా ఇండియా కూటమి భాగస్వామిగా వైసీపీ చేరినా.. ఏపీలో కూటమికి గట్టి పోటీ ఇవ్వొచ్చని.. కేంద్రంలోనూ బిజెపికి వ్యతిరేక పక్షంలోకి మారేందుకు జగన్కు రోడ్డు మ్యాప్ సిద్ధమవుతోందని విశ్లేషిస్తున్నారు.
-
సహాయ నిరాకరణ..
మరోవైపు గతం మాదిరిగా కేంద్ర బిజెపి నుంచి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా రక్షణ కొరవడుతోంది. మునుపటి మాదిరిగా పూర్తి సహకారం అందడం లేదు. దానికి కారణం చంద్రబాబు. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో టిడిపి కూటమి సహకారం అనివార్యంగా మారింది.
పైగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. ఈ పరిణామ క్రమంలోనే జగన్కు కేంద్ర పెద్దల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు ఏపీలో కూడా పార్టీ పట్టు సడలుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సహకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది.
