Homeఆంధ్ర ప్రదేశ్బొత్సకు అగ్నిపరీక్ష...!

బొత్సకు అగ్నిపరీక్ష…!

  • మేనల్లుడు చిన్న శ్రీను దూరం కావడంతో తగ్గిన బలం

  • కుమార్తెను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గెలిపించుకోవడం అనివార్యం

  • ఓడిపోతే మాత్రం పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేం. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఒక సాధారణ కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ఎదిగిన తీరు ఎప్పటికీ ప్రత్యేకమే.

అయితే ఆయన ఎదిగారు. ఆయన కుటుంబం ఎదిగింది. ఆయన ఎదిగేందుకు కుటుంబమే ఎంతగానో దోహదపడింది. కానీ ఇప్పుడు అదే కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది. తనను విభేదించి మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడం బొత్స సత్యనారాయణకు ఒక అగ్నిపరీక్ష.

  • రాజుల ఆధిపత్యం..

విజయనగరం అంటేనే రాజుల సామ్రాజ్యం. రాజుల మధ్య ఆధిపత్య పోరు. జిల్లాలో తూర్పు కాపుల ప్రాబల్యం ఉన్నా.. రాజకీయంగా మాత్రం రాజుల మధ్య పోరు నడిచేది. బొత్స ఫ్యామిలీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తూర్పు కాపుల ప్రాబల్యం పెరిగింది. అంతకుముందు టిడిపి అంటే అశోక్ గజపతిరాజు.. కాంగ్రెస్ అంటే పెనుమత్స సాంబశివరాజు అన్నట్టు ఉండేది.

అటువంటి సమయంలో విజయనగరంలోని గాజులరేగ పిఎసిఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బొత్స సత్యనారాయణ. పెనుమత్స సాంబశివరాజు అనుచరుడిగా ఎదిగారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా బొబ్బిలి ఎంపీ టికెట్ సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బొత్స అనూహ్య విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం 7 ఎంపీ సీట్లు మాత్రమే. అందులో బొత్స సత్యనారాయణ ఒకరు కావడం గమనార్హం. అలా ఎంపీ అయిన బొత్స రాజశేఖర్ రెడ్డి దృష్టిలో పడ్డారు. 2004లో చీపురుపల్లి నుంచి గెలిచి మంత్రి అయ్యారు.

అప్పటివరకు కాంగ్రెస్ అంటే పెనుమత్స సాంబశివరాజు అనే పేరు వినిపించేది. అక్కడి నుంచి మాత్రం బొత్స హవా పెరిగింది. మొత్తం ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. అది మొదలు నేటి వరకు ఆ కుటుంబ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అదే కుటుంబంలో అడ్డగోలు చీలిక ఏర్పడింది.

  • ముఖాముఖి పోటీ..

బొత్స బలమైన నాయకుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విశాఖ ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా ఛాన్స్ కల్పించారు. అయితే బొత్స ఇంతలా స్వేచ్ఛగా రాజకీయం చేశారు అంటే దాని వెనుక ఆయన మేనల్లుడు చిన్న శ్రీను ఉండేవారు.

బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండగా క్షేత్రస్థాయిలో అన్ని తానై వ్యవహరించేవారు చిన్న శ్రీను. అటువంటి నేత ఇప్పుడు బొత్స కు దూరం కావడమే కాదు.. ప్రత్యర్థిగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే బొత్స తన కుమార్తె డాక్టర్ అనూషను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు అదే పదవిని తన కుమార్తె సిరి సహస్రకు దక్కించుకోవాలని టిడిపి వైపు వెళ్లారు చిన్న శ్రీను.

ముఖాముఖి పోరు ఎదురైతే మాత్రం బొత్స తన సీనియారిటీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. టిడిపి కూటమికి ఎదురెళ్లి తన కుమార్తెను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గెలిపించుకునే బాధ్యత ఆయనపై ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం వైసీపీకి ఆ రేంజ్ ఉందా అంటే అనుమానమే. కచ్చితంగా ఇది బొత్సకు అగ్నిపరీక్ష. ఓడిపోతే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే. అందుకే ఇప్పుడు అందరి దృష్టి విజయనగరం జిల్లా పై పడింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు