బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను హత్య చేసి.. వారి తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఇమ్రాన్ తన 10, 5 ఏళ్ల కుమార్తెలతో కలిసి సోమవారం సాయంత్రం హోటల్‌లో బసకు వెళ్లాడు.
హోటల్ గదిలో ఉన్న సమయంలో ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గదిలోని టాయిలెట్‌కు వెళ్లి తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు.
మంగళవారం హోటల్ సిబ్బంది గదిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలు మంచంపై విగతజీవులుగా కనిపించగా.. ఇమ్రాన్ తీవ్ర రక్తస్రావంతో టాయిలెట్‌లో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, భార్యకు ఓ సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఇమ్రాన్‌కు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు, వారి పెంపకం విషయంలో ఆందోళనకు గురైన ఇమ్రాన్.. చివరకు ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన బెంగళూరులో తీవ్ర విషాదాన్ని నింపింది.
also read: మద్యం మత్తులో ఆలయంలో చోరీ.. రెండున్నరేళ్ల తర్వాత పశ్చాత్తాపంతో తిరిగి ఇచ్చేసిన దొంగ!
