క్రైమ్ మిర్రర్ : తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు వరుసగా చర్యలు చేపడుతున్నప్పటికీ.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ జిల్లా స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వివరాల ప్రకారం.. జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా పనిచేస్తున్న గోవింద్రామ్ ఇటీవల జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కళాశాలలో గుర్తించిన కొన్ని లోపాలు, నిబంధనలకు సంబంధించిన అంశాలను ఆయన పరిశీలించారు.
అయితే వాటిని సరిచేసినట్లు చూపిస్తూ కళాశాలకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కళాశాల యాజమాన్యం తొలుత రూ.30 వేల మొత్తాన్ని ఆయనకు అందించినట్లు సమాచారం. అయితే మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఒత్తిడి చేయడంతో కళాశాల ప్రతినిధులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన కార్యాలయంలో గోవింద్రామ్ మిగిలిన రూ.20 వేల నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం డిమాండ్ చేయడం, స్వీకరించడం వంటి ఆరోపణలపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: కేక్ తిన్న కొద్దిసేపటికే.. ముగ్గురికి అస్వస్థత
