– కాంగ్రెస్ లోకి వచ్చినట్టే వచ్చి తిరిగి మాతృ పార్టీలోకి
– అధికార పార్టీకి గట్టి షాక్
– పటాన్చెరు ఎమ్మెల్యేను తిరిగి కలిపేసుకున్న భారత రాష్ట్ర సమితి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని.. అటు తరువాత వెనక్కి తగ్గిన పటాన్చెరు గులాబీ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయనను గులాబీ దళం మళ్లీ తమలో కలిపేసుకుంది. గతంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై స్పీకర్ వద్ద అనార్హత పిటిషన్లు దాఖలు అయ్యాయి. కానీ స్పీకర్ కాంగ్రెస్ లో చేరలేదని తేల్చేయడంతో సాంకేతికంగా బయటపడ్డారు.
కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి..
పటాన్చెరు ఎమ్మెల్యే తిరిగి గులాబీ పార్టీకి చేరిపోవడం వెనుక అంత ఆశ్చర్యపోనవసరం లేదు. పటాన్చెరు స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయనకు గిట్టడం లేదు. ఆయనకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదురవుతోంది. అందుకే హస్తం పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని తిరిగి కెసిఆర్ చెంతకు చేరారు. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు గట్టిగానే శ్రమించారు మహిపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు నేరుగా గులాబీ పార్టీలోకి తిరిగి చేరడం పెద్దగా అంచనాలు లేవు. పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు.
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన నటి అమీషా పటేల్!
మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యత వహించి..
మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి చూపిన ఫలితాలు.. నియోజకవర్గం పై ఆయనకు ఉన్న పట్టును చూసి అధిష్టానం ఆయనకు తిరిగి స్వాగతించింది. ఇతర నేతలకు పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నా.. మహిపాల్ రెడ్డి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఫామ్ హౌస్ లో కెసిఆర్ అధ్యక్షతన జరిగిన అత్యంత కీలకమైన భారత రాష్ట్ర సమితి ఎల్పీ సమావేశానికి కూడా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. కీలక చర్చల్లో ఆయనను భాగస్వామ్యం కల్పించడం ద్వారా గులాబీ పార్టీ తిరిగి తనలో కలుపుకుంది. అయితే ఈ పరిణామం అధికార కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లోకి వెళ్లిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలలో కూడా తీవ్ర పునరాలోచనను రేకెత్తిస్తోంది. అధికారంలోకి వచ్చినా స్థానిక నాయకత్వంతో సమన్వయం లేకపోవడం, క్యాడర్ మద్దతు లభించకపోవడంతో ఊగిసలాట లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలకు మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ గూటికి చేరినట్టే చేరి తిరిగి గులాబీ గాలానికి చిక్కారు గూడెం మహిపాల్ రెడ్డి.
