Homeతెలంగాణఅక్రమ బియ్యం దందా మానుకోండి : ఎస్పీ రామ్‌కుమార్‌ హెచ్చరిక

అక్రమ బియ్యం దందా మానుకోండి : ఎస్పీ రామ్‌కుమార్‌ హెచ్చరిక

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-పేదల కోసం ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా అందిస్తున్న, పీడీఎస్‌ సన్నబియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న, అక్రమ రవాణాదారులు తమ పంథా మార్చుకోవాలని, సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌ హెచ్చరించారు. నిరుపేద వినియోగదారుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని, డబ్బులు ఆశ చూపుతూ సన్నబియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమంగా డంపింగ్‌ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో, ఈటీఎఫ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌బాబు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీశైలం, ప్రభాకర్‌, సిబ్బంది స్వామి, ఉపేందర్‌ తదితరులు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని, గొల్లపల్లి, దావలాపూర్‌ అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా డంప్‌ చేసిన దాదాపు 580 బస్తాల సన్నబియ్యాన్ని పట్టుకున్నారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా దావలాపూర్‌ అటవీ ప్రాంతం, ఇటు సిద్దిపేట జిల్లా చివరి ప్రాంతం కావడంతో రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతాన్ని, అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. పకడ్బందీ వ్యూహంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం నిర్వహించిన దాడితో అక్రమ డంపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు.

నెలలుగా సాగుతున్న దందా.. నిందితుడి అరెస్ట్‌

ఈ అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించి జగదేవ్‌పూర్‌ మండలం, వట్టపల్లి ప్రాంతానికి చెందిన శంకర్‌ నాయక్‌ అనే వ్యక్తి అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. సన్నబియ్యం అక్రమ డంపింగ్‌ విషయాన్ని సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారులకు, సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం పట్టుబడిన బియ్యంతో పాటు, నిందితుడు శంకర్‌ నాయక్‌ను స్థానిక జగదేవ్‌పూర్‌ పోలీసులకు అప్పగించారు. సీజ్‌ చేసిన సన్నబియ్యాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారులు తమ ఆధీనంలోని రైస్‌మిల్‌కు తరలించారు. నిందితుడిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం జగదేవ్‌పూర్‌ పోలీసులు విచారిస్తున్నారు.

పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
పేదలు కూడా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తోందని ఈటీఎఫ్‌ ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. అయితే కొందరు అక్రమ వ్యాపారులు నిరుపేద వినియోగదారులకు డబ్బులు ఆశ చూపించి బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, డంపింగ్‌ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై, ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రామ్‌కుమార్‌ హెచ్చరించారు. అక్రమ బియ్యం దందాకు పాల్పడే వారు వెంటనే తమ విధానాన్ని మార్చుకోవాలని, లేకుంటే చట్టపరమైన కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు