క్రైమ్ మిర్రర్ : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో రూపొందించినట్లు అనుమానిస్తున్న ఏఐ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తామని నమ్మిస్తూ, వారిని మోసం చేసేందుకు ఈ వీడియోను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో సీఎం మాట్లాడుతున్నట్లుగా కనిపించే దృశ్యాలకు హిందీ ఆడియోను జత చేశారు. ఆర్థిక సహాయం పొందాలనుకునే వారు ఒక ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలంటూ అందులో సూచించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై తమిళనాడు క్రైమ్ బ్రాంచ్–సీఐడీ ఈ నెల 1న కేసు నమోదు చేసింది. ఫేక్ ఫేస్బుక్ ఖాతాల ద్వారా డీప్‌ఫేక్ వీడియోను ప్రచారం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన పోలీసులు.. ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలు, లాగ్స్ అందించాలని మెటా సంస్థను కోరారు. అదే సమయంలో వీడియోను ప్రసారం చేస్తున్న ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కూడా పోలీసులు సమాచారం అందించారు. నకిలీ వీడియోలను తొలగించాలని ఆయా సంస్థలను కోరినట్లు అధికారులు వెల్లడించారు. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశాలు ఉండటంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వీడియో వెనుక ఉన్న వ్యక్తులు, వాట్సాప్ నంబర్ వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
also read : గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి
