క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రీతు భాయ్‌కు సంబంధించిన స్థావరాల్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన నగదును అక్రమ మార్గాల్లో తరలించారా? ఆ డబ్బును స్థిరాస్తులు లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారా అనే కోణంలోనూ వివరాలను సేకరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న నగదు లావాదేవీలు, హవాలా వ్యవహారాలకు సంబంధించిన ఆధారాల కోసం అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దాని ద్వారా సమకూరిన అక్రమ ఆస్తులపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనిఖీలు పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులకు గాయాలు
