మద్యం సేవించి ఇంటికి వచ్చిన కుమారుడిని చూసి తండ్రి నవ్వాడన్న కారణంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు విచక్షణ కోల్పోయి తండ్రిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పెనుమూరు మండలంలోని మాణిక్యరాయునిపల్లెలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చెంగారెడ్డికి ఇద్దరు కుమారులు జోకేశ్‌రెడ్డి, హేమచంద్రారెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు జోకేశ్‌రెడ్డి మద్యం సేవించి భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అతడు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య తన మామ చెంగారెడ్డికి ఫోన్ చేసి విషయం తెలిపింది.
దీంతో చెంగారెడ్డి కుమారుడి ఇంటికి వెళ్లి అతడిని మందలించినట్లు తెలుస్తోంది. అయితే జోకేశ్‌రెడ్డి మద్యం మత్తులో ఉండగా తండ్రి తనను చూసి నవ్వాడని భావించి ఆగ్రహానికి గురయ్యాడు. మాటామాటా పెరగడంతో కత్తితో తండ్రిపై దాడి చేసి గొంతు కోసినట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో చెంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం జోకేశ్‌రెడ్డి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ‘ఇరుముడి’ జోరు.. రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ సినిమా!
