క్రైమ్ మిర్రర్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుల ప్రాణనష్టానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. రష్యా సైన్యంలో చేరిన భారతీయుల్లో ఇప్పటివరకు 51 మంది మృతి చెందినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగు యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
విక్రమ్ మిశ్రీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో మొత్తం 227 మంది భారతీయులు చేరినట్లు తెలిపారు. వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోగా.. 139 మందిని రష్యా సైన్యం నుంచి విడిపించి భారత్‌కు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇంకా కొంతమంది రష్యా సైన్యంలో ఉన్నారని, వారిని కూడా స్వదేశానికి తీసుకురావడానికి రష్యా ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
అదే సమయంలో విదేశాంగశాఖ కార్యదర్శి కీలక హెచ్చరిక చేశారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని, రష్యా సైన్యంలో చేరేందుకు ప్రయత్నించవద్దని భారతీయులకు సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. ఇటీవల నా అన్వేష్ రష్యా సైన్యంలో చేరడం ద్వారా నెలకు సుమారు రూ.16 లక్షల వరకు సంపాదించవచ్చని చెబుతూ ఓ వీడియోలో మాట్లాడినట్లు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా కాకుండా రష్యా అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.
అయితే తాజాగా కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలతో ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా సైన్యంలో చేరాలని సూచించే ముందు అక్కడి పరిస్థితులు, ప్రమాదాలను ప్రజలకు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
యుద్ధ ప్రాంతానికి సంబంధించిన విషయాల్లో పూర్తి సమాచారం లేకుండా సూచనలు చేయడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం నేరుగా రష్యా సైన్యంలో చేరాలని ప్రోత్సహించే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం నా అన్వేష్‌కు సంబంధించిన పాత వ్యాఖ్యలు, కేంద్రం తాజా ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు కారణమయ్యాయి.
also read : రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
