క్రైమ్ మిర్రర్ : కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్‌కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. తపాలా ద్వారా ఆయనకు ఓ సంతకం లేని లేఖ అందినట్లు మంగళవారం ఆయన కార్యాలయం వెల్లడించింది. ఆ లేఖలో చిరాగ్ పాస్వాన్‌ను ఉగ్రవాదులు త్వరలో హత్య చేస్తారంటూ హెచ్చరికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా లేఖలో రెండు మొబైల్ నంబర్లను కూడా పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. లేఖ వెనుక ఉన్న వ్యక్తులు, దాని ఉద్దేశంపై ఆరా తీస్తున్నారు.
హోంశాఖకు ఫిర్యాదు
బెదిరింపు లేఖపై చిరాగ్ పాస్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎవరున్నారు, అందులోని అంశాలు ఎంతవరకు వాస్తవమనే విషయాలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్‌కు కేంద్ర హోంశాఖ నుంచి ‘జెడ్’ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. తాజాగా వచ్చిన బెదిరింపు నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను మరోసారి సమీక్షించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అవసరమైతే భద్రతను మరింత పెంచే చర్యలు తీసుకోవాలని కోరారు.
రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి పలు బహిరంగ కార్యక్రమాలు, పర్యటనల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని హోంశాఖను కోరినట్లు సమాచారం. మరోవైపు బెదిరింపు లేఖ మూలాలను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖను ఎవరు పంపారు, అందులో పేర్కొన్న మొబైల్ నంబర్లకు ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
also read : చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు పట్టివేత
