క్రైమ్ మిర్రర్ : చందానగర్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 227 మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియం సమీపంలో పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న సరసాయి రామ్, కుంచాల రవీంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా Wofen 10ml పేరుతో ఉన్న 227 మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీటి విక్రయాలకు సంబంధించిన నగదు లావాదేవీలు కాకుండా ఆన్‌లైన్ చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
ఈ వ్యవహారంలో వినియోగదారులుగా ఉన్నట్లు అనుమానిస్తున్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి విక్రయించారు, ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
also read : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట
