Homeఅంతర్జాతీయంనేపాల్‌లో వరద బీభత్సం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు

నేపాల్‌లో వరద బీభత్సం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు

క్రైమ్ మిర్రర్ : నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ బురద వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరద ఉధృతికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో నువాకోట్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బిదుర్ మున్సిపాలిటీ పరిధిలోని బేత్రావతి ప్రాంతంలో వరదలకు దెబ్బతిన్న ఓ ఇంటిని అధికారులు పరిశీలిస్తుండగా.. అందులో ఏకంగా 24 మంది మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో సహాయక, గాలింపు చర్యలను కొనసాగిస్తోంది.

శిథిలాల్లో మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో అధికారులు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంట్లో లభించిన మృతదేహాల తుది సంఖ్యను గాలింపు చర్యలు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని నువాకోట్ జిల్లా ఎస్పీ బిపిన్ రెజ్మీ తెలిపారు. అయితే ఒకే ఇంట్లో ఇంత పెద్ద సంఖ్యలో మృతదేహాలు లభించడం వెనుక కారణమేంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆ ఇల్లు ఎవరిది, యజమాని ఎవరు అనే వివరాలు కూడా ప్రస్తుతం అధికారులకు తెలియలేదు. అది సాధారణ నివాస గృహమా.. లేక హోటల్ లేదా గెస్ట్‌హౌస్‌గా ఉపయోగిస్తున్న భవనమా అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు, బురద ప్రవాహాల కారణంగా నేపాల్‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మృతుల సంఖ్య ఇప్పటికే వెయ్యి దాటినట్లు సమాచారం. ఇంకా పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
also read : ఆశ్రమం ముసుగులో మైనర్‌పై లైంగిక దాడి.. స్వామీజీ అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు