యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రేమ, కామెడీ, థ్రిల్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ మూవీ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో హీరోయిన్ అనంతిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన పాత్ర, షూటింగ్ అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘రోమాంచకం’ కథ నచ్చడంతోనే ఓకే చెప్పా..
‘8 వసంతాలు’ తర్వాత ఎన్నో కథలు విన్నప్పటికీ తనకు ప్రత్యేకంగా నచ్చిన కథ ఏదీ దొరకలేదని అనంతిక చెప్పారు. ఆ సమయంలో ‘రోమాంచకం’ కథ వినడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కలిగిందన్నారు. తాను ఎప్పటి నుంచో చేయాలనుకున్న తరహా పాత్ర ఇందులో దొరికిందని తెలిపారు.
సినిమాలో తన పాత్ర చాలా సరదాగా, బబ్లీగా ఉంటుందని చెప్పారు. పాత్రలోని ఎనర్జీ తనకు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమాకు వెంటనే అంగీకరించినట్లు వివరించారు.
ప్రేమతో పాటు కామెడీ, థ్రిల్..
‘రోమాంచకం’ కేవలం లవ్ స్టోరీగా మాత్రమే ఉండదని అనంతిక తెలిపారు. ప్రేమకథతో పాటు నవ్వించే సన్నివేశాలు, ఉత్కంఠ కలిగించే అంశాలు కూడా సినిమాలో ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా యువతకు సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, కుటుంబ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.
ఈ సినిమాలో తాను తమిళ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని చెప్పారు. సుమంత్ ప్రభాస్ పోషించిన పాత్ర చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటుందని.. దానికి సరిపోయే విధంగా తన పాత్రను దర్శకుడు రూపొందించారని తెలిపారు. తమ ఇద్దరి మధ్య సన్నివేశాలు సహజంగా, వేగంగా సాగుతాయని అనంతిక వివరించారు.
షూటింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశాం..
‘రోమాంచకం’ షూటింగ్ సమయంలో చిత్ర బృందం ఎంతో సరదాగా గడిపిందని అనంతిక తెలిపారు. తాము షూటింగ్లో ఎంతగా ఎంజాయ్ చేశామో.. థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా అంతే ఆనందిస్తారని అన్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన నటనను ప్రశంసించడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగాను తొలిసారి చూసినప్పుడు ఆయన చాలా సీరియస్‌గా ఉంటారని భావించానని.. అయితే పరిచయం అయిన తర్వాత ఆయన చాలా సరదా వ్యక్తి అని తెలిసిందన్నారు. ఇక సుమంత్ ప్రభాస్‌తో మొదటి రోజే మంచి స్నేహం ఏర్పడిందని అనంతిక తెలిపారు.
చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి..
తనకు చిన్నతనం నుంచే కళలంటే ఎంతో ఇష్టమని అనంతిక చెప్పారు. ఎల్కేజీ చదువుతున్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకుంటున్నానని.. ఆ అనుభవం ఇప్పుడు నటనలో కూడా తనకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు.
భవిష్యత్తులో మంచి కథ, మంచి పాత్ర లభిస్తే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనంతిక స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మూడు అంశాలే సినిమాకు బలం..
‘రోమాంచకం’లో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అనంతిక తెలిపారు. ముఖ్యంగా ప్రేమకథ నుంచి థ్రిల్ పుట్టే విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు.
ఈ సినిమా తన కెరీర్‌కు మాత్రమే కాకుండా హీరో సుమంత్ ప్రభాస్‌కు కూడా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని అనంతిక పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానున్న ‘రోమాంచకం’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
also read: తుక్కుగూడ నర్సు అత్యాచారం కేసు- ఆత్మరక్షణ కోసం చివరి వరకు పోరాడిన బాధితురాలు
