క్రైమ్ మిర్రర్ : కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందేమాతరం గేయంలోని రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం గేయంలోని ఆరు చరణాలను ఆలపించిన ఘటనపై కూడా శివకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ఆ కార్యక్రమంలో ఆరు చరణాలు పాడారని ఆయన పేర్కొన్నారు. ఇకపై మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో రెండు చరణాలకే పరిమితం చేస్తామని స్పష్టం చేశారు.
1937 నాటి తీర్మానానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం
వందేమాతరం గేయం విషయంలో 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నే అనుసరించాలని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు శివకుమార్ తెలిపారు. గేయంలోని రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న అప్పటి తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. జాతీయ గేయానికి సంబంధించి ఆరు చరణాలను ఆలపించాలనే నిబంధనకు కేంద్రం చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి
దేశంలో వివిధ వర్గాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయని శివకుమార్ అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ సిద్ధాంతమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులకు ఎలాంటి మతం ఉండదని వ్యాఖ్యానించారు. ‘హిందూ-హిందుత్వవాదం’పై జరుగుతున్న చర్చ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
also read : నేపాల్‌లో వరద విలయం.. 1,000 మంది గల్లంతు
