పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనతో ఆలయ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఈ నెల 20న శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే గది తీసుకున్న తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఎలాంటి కదలికలు లేకపోవడంతో సత్రం సిబ్బందికి అనుమానం వచ్చింది. పలుమార్లు తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా, బాత్రూంలో ముగ్గురు మహిళలు, హాల్లో ఇద్దరు పురుషులు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులంతా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబ సభ్యులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారు ఈ దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: తిరుమల శ్రీవారి లడ్డూలో సిల్క్ గుడ్డ ముక్క.. భక్తుడి వీడియో వైరల్
