ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. హైదరాబాద్‌కు చెందిన ముస్తి సాయి ప్రదీప్ అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు సాయి ప్రణీత్ వెల్లడించారు.
టెక్సాస్‌లోని శాన్ అంటోనియోలో నివసిస్తున్న సాయి ప్రదీప్.. అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సప్లై చైన్ అనలిస్ట్‌గా సుమారు ఐదేళ్ల అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ కొంతకాలంగా సరైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
ఉద్యోగం కోసం సాగిన అన్వేషణలో ఎదురైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
సాయి ప్రదీప్ మృతితో హైదరాబాద్‌లోని ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబం ఫండ్‌రైజింగ్ ప్రారంభించింది.
అమెరికాలో చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లిన తెలుగు యువత ఎదుర్కొంటున్న వీసా, ఉద్యోగం, ఆర్థిక సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విదేశాల్లో ఉన్న యువత తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, నమ్మకమైన వ్యక్తులతో తమ సమస్యలను పంచుకోవాలని ప్రవాస తెలుగు సంఘాలు సూచిస్తున్నాయి.
also read: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమ్మె విరమణ.. ప్రయాణికులకు భారీ ఊరట!
