గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘ఈగల్ ఛాలెంజ్’ పేరుతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రకటించింది.
గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించి నిందితులను పట్టుకునేలా సహకరిస్తే రూ.5,000 నగదు బహుమతి అందించనున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. అదే విధంగా గంజాయి సేవిస్తున్న వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తే రూ.1,500 రివార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. సమాచారం అందించే వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈగల్’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ఈ విభాగం ద్వారా చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలు ఇలా సహకరించాలి
గంజాయి రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేసి మాదకద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల సహకారంతో గంజాయి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ‘ఈగల్ ఛాలెంజ్’ను ముందుకు తీసుకెళ్తున్నారు.
also read: ప్రియుడి కోసం తల్లిదండ్రులను హత్య చేసిన యువతి.. జైలు నుంచి విడుదలైన కొద్దిరోజులకే ఆత్మహత్య
