Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

క్రైమ్ మిర్రర్ : శ్రీకాకుళం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ ఇంటర్‌ విద్యార్థినిని వేధించిన యువకుడు, ఆమె తన వెంట రావడానికి నిరాకరించడంతో బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. మందస మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై దాడి చేసి అక్కడి నుంచి నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మందస మండలం చిక్కిడిగాం గ్రామానికి చెందిన రింటూ గౌడ్‌ (25) ఈనెల 12న సాయంత్రం మందస బస్టాండ్‌కు వచ్చాడు. అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇంటర్‌ విద్యార్థిని వద్దకు వెళ్లి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అనంతరం తనతో రావాలని ఆమెపై ఒత్తిడి చేశాడు.

అయితే యువకుడి ప్రతిపాదనను విద్యార్థిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రింటూ గౌడ్‌ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో విద్యార్థిని చేతిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని సహాయం కోసం కేకలు వేయగా, అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆమెకు అండగా నిలిచారు. దాడిలో చేతికి గాయమైన విద్యార్థినిని స్థానికులు హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మందస పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం రింటూ గౌడ్‌ను అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకుడు గతంలోనూ విద్యార్థినిని వేధించాడా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
also read : ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోలేదు: సంజూష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు