Homeక్రైమ్ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోలేదు: సంజూష్

ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోలేదు: సంజూష్

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించారు. ఈ ప్రమాదంలో భారతి ముఖి మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి వెళ్లిపోలేదని సంజూష్ స్పష్టం చేశారు. గాయపడిన భారతి ముఖిని వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించానని తెలిపారు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై అధికారులకు వివరాలు అందించినట్లు చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని సంజూష్ పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రమాద సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానా అనే అంశాన్ని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షతో పాటు రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ మూడు పరీక్షల్లోనూ మద్యం సేవించినట్లు నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు.

తాను ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలు, బాధితురాలిని ఆస్పత్రికి తరలించడం, పోలీసులకు సమాచారం అందించడం, దర్యాప్తుకు సహకరించడం వంటి అంశాలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని సంజూష్ కోరారు. వైద్య పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులపై నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

చట్టపరమైన దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని సంజూష్ తెలిపారు. ఈ ఘటనలో తనపై ఉన్న చట్టపరమైన బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సమగ్ర దర్యాప్తు ద్వారా అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
also read : మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల హడావిడి….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు