Homeక్రైమ్ఢిల్లీలో భార్య బంధువుల దాడి.. 31 ఏళ్ల టెకీ మృతి

ఢిల్లీలో భార్య బంధువుల దాడి.. 31 ఏళ్ల టెకీ మృతి

క్రైమ్ మిర్రర్ : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో జరిగిన వివాదం నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. నిహాల్ విహార్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీ పార్క్ ప్రాంతంలో నివసించే వినయ్ గుప్తా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న గుప్తాకు సుమారు మూడున్నరేళ్ల క్రితం బుద్ధ విహార్‌కు చెందిన రేఖతో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు.

శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులకు మందులు ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. కొద్దిసేపటికే ఆమె బంధువులు గుప్తా ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇంటి బయట వినయ్ గుప్తాపై వారు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గుప్తాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 103(1), 3(5) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రశ్నిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అసలు వివాదానికి కారణమేంటి, దాడి ఎలా జరిగింది, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహం కారణంగానే ఈ ఘటన జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
also read : ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు