-
పతాక స్థాయికి విద్యార్థుల ఆందోళనలు
-
పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రక్రియపై భగ్గుమంటున్న యువత
-
అణచివేత ధోరణిలో రేవంత్ సర్కార్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జెన్ జీ ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. యువత ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ అప్రమత్తం అవుతోంది. తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చుతూ ప్రభుత్వం శక్తి స్కీం ప్రవేశపెట్టింది. జీవో 97 జారీ చేసింది.
దీనిపై జెన్ జీ విద్యార్థి లోకం భగ్గుమంది. పలుచోట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. చాలాచోట్ల పోలీసులు లాఠీ చార్జ్ తో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
-
ప్రభుత్వమే ఛాన్స్ ఇచ్చింది..
అయితే ఈ విలీన ప్రక్రియతో ఈ ఉద్యమాలకు అవకాశం ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ పాలిటెక్నిక్ కాలేజీల విలీన నిర్ణయం వల్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న మూడు సంవత్సరాల సాంకేతిక విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది అనేది విద్యార్థుల ఆందోళన. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేసిన తర్వాత ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా ఇంజనీరింగ్ లో ప్రవేశం ఉండేది.
ఈ అవకాశాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది అనేది విద్యార్థు నోటి నుంచి వస్తున్న మాట. సాంకేతిక విద్యను క్రమంగా నైపుణ్య శిక్షణ ముసుగులో ప్రైవేటు సంస్థల పరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని వేలాదిమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
-
సర్వత్రా ఉద్రిక్తత..
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి దీనిపై. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎక్కడికక్కడే ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొన్నిచోట్ల లాఠీ చార్జీలు జరిగాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యార్థులకు, పోలీసులకు మధ్య జరిగిన తీవ్రతోపులాట, లాఠీ చార్జ్ ప్రయత్నాల్లో చాలామంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో జెన్ జీ ఉద్యమం తీవ్రతరం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…
