నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి.. కేవలం ఎనిమిది రోజుల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రిన్సిపల్ వద్ద చదువుకున్న విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు తేలడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మందలింపుతో పెరిగిన కక్ష
పూల్‌సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన 16 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నారు. సెల్‌ఫోన్ వినియోగం, చెడు అలవాట్లకు గురవుతున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి.. వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను మందలించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెపై విద్యార్థులు కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
డబ్బు కోసం పథకం
రూపారెడ్డి ఇంట్లో నగదు ఉంటుందనే అంచనాతో ఇద్దరూ ఆమెను హత్య చేసి డబ్బు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక రూపొందించుకున్నారని, హత్యకు అవసరమైన వస్తువులను సమకూర్చుకున్నారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
భర్త హైదరాబాద్‌లో ఉన్న సమయంలో..
ఈ నెల 8 నుంచి వరుస సెలవులు రావడంతో రూపారెడ్డి తన భర్త రాజేందర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లారు. వారి కుమారుడు అక్కడ ఇంజినీరింగ్ చదువుతున్నట్లు సమాచారం. సెలవులు ముగియడంతో ఈ నెల 11న రూపారెడ్డి కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. పాఠశాల ముగిసిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన విద్యార్థులు తమ ప్రణాళికను అమలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఒకరు కాపలా.. మరొకరు ఇంట్లోకి
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఇద్దరిలో ఒకరు ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద కాపలాగా ఉండగా, మరొకరు ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లాడు. అక్కడ రూపారెడ్డి అతడిని గుర్తించడంతో ఆమెపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు రూ.2.5 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
ఆధారాలు చెరిపే ప్రయత్నం
హత్య అనంతరం ఇద్దరూ రూపారెడ్డి సెల్‌ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేసి ఇంటికి సమీపంలోని బండరాయి కింద ఉంచినట్లు సమాచారం. తాము ఉపయోగించిన దుస్తుల్లో కొన్నింటిని డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు తీసుకున్న నగదు విషయంలోనూ తేడా ఉన్నట్లు సమాచారం. ఒకరి వద్ద సుమారు రూ.2.10 లక్షలు, మరొకరి వద్ద రూ.40 వేల వరకు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎనిమిది రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
హత్య జరిగిన వెంటనే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర వివరాలను పరిశీలించారు. అనుమానితుల కదలికలు, హత్యకు ముందు జరిగిన పరిణామాలను విశ్లేషించి చివరకు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు ద్వారా వెలికితీస్తున్నారు.
also read: ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం.. గర్భిణి కడుపులోనే గ్లోవ్స్, టిష్యూలు!
